పార్టీలకు అతీతంగా…నాయకుల ధ్యాసంగా నినాదాలపైనే!
పార్టీలకు అతీతంగా…నాయకుల ధ్యాసంగా నినాదాలపైనే!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా వచ్చే ఏడాది ఏపీలోనూ లేదా ముందస్తు అంటే ఈ ఏడాదే ఎన్నికల గంట మోగనుంది. అయితే ఏ పార్టీ విజయం దక్కించుకోవాలన్నా ఏ పార్టీ అధికార పీఠం ఎక్కాలన్నా ఖచ్చితంగా కావాల్సింది ప్రజల ఆశీర్వాదమే. మరి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు వారి చెంతకు చేరుకునేందుకు పార్టీలకు కావాల్సింది నినాదాలు.
గతంలో ‘వస్తున్నా మీకోసం‘ అని బాబు, ‘రావాలి జగన్-కావాలి జగన్‘ అని వైసీపీ
వస్తున్నా మీకోసం అంటూ గతంలో చంద్రబాబు పిలుపునిచ్చినా, రావాలి జగన్-కావాలి జగన్ అని వైసీపీ పిలుపునిచ్చినా అంతిమంగా ప్రజలను తమవైపు తిప్పుకొని ఓట్లు దూసుకునే ప్రణాళికే ఉంటుంది. ఇక, తెలంగాణలోనూ ఇప్పటి వరకు ఇలాంటి నినాదాల పిచ్చి లేకపోయినా సెంటిమెంటుతో కొట్టుకొచ్చారు. మన నీళ్లు-మన నేల- మన పాలన అంటూ బీఆర్ఎస్, ఇచ్చింది-తెచ్చిందీ మేమే అంటూ కాంగ్రెస్ ప్రజల మధ్యకువెళ్లాయి.
తాజాగా నినాదాల కోసం వెంపర్లు
అయితే ఇప్పుడు అటు ఏపీలో చూసినా ఇటు తెలంగాణలో చూసినా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలకు నినాదాలు కరువయ్యాయి. పాతవి ప్రయోగిద్దామంటే ప్రజలు ఇప్పటికే వినీ వినీ బోరు కొట్టి ఉన్నారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నినాదాల కోసం వెంపర్లాడుతున్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు తన బృందానికి ఇదే టాస్క్ అప్పగించారు. దీంతో యువగళం వంటి కార్యక్రమం అయితే ఏర్పాటైంది కానీ నినాదాలు మాత్రం రాలేదు.
వైసీపీ కూడా కొన్ని నినాదాలు రెడీ
అవే “జగనన్నే మా నమ్మకం“,”మా నమ్మకం నువ్వే జగన్“,”వైనాట్ 175” వంటివి ఇప్పటికే ప్రయోగించేశారు. కానీ, రాసిలో వాసిలో వాటికన్నా మించిన నినాదాల కోసం ఏపీలో ఈ రెండు పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. ఉన్నత విద్య చదివిన వారి మెదళ్లకు పదును పెట్టి నినాదాలు ఇస్తే లక్షలు కుమ్మరించేందుకు పార్టీలు రెడీగా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికైతే తమ అనుచరులకు ఫోన్లు చేస్తున్న పార్టీల నేతలు నినాదాలు కావాలని చెబుతున్నారు.
కొత్త నినాదాల కోసం నాయకులు ఒత్తిడి
ఇక, తెలంగాణలోనూ అంతర్గత చర్చల్లో కొత్త నినాదాల కోసం నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. తద్వారా ప్రజల మధ్యకు వెళ్లాలనేది పార్టీల వ్యూహంగా ఉంది. ఇప్పుడు నాయకుల ధ్యాసంగా నినాదాలపైనే ఉంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరు నినాదాలు ఇచ్చినా తీసుకుని పరిహారం ఇచ్చేందుకు కూడా రెడీగానే ఉన్నారు. మరి ఎవరు ముందుకు వస్తారో ఎలాంటి నినాదాలు ఇస్తారో చూడాలి.
