పాలన భేష్..

 

వైసీపీ పాలన భేష్.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థపై ఐఐపీఏ టీమ్ ప్రశంసలు…

వైసీపీ పాలన భేష్.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థపై ఐఐపీఏ టీమ్ ప్రశంసలు…

ఏపీలో వైసీపీ సర్కార్ పాలన అరాచకం, అన్యాయమంటూ ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటే… మరోవైపు జగన్ పాలన భేష్ అంటూ ఇతర రాష్ట్రాలు, సంస్థలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ, గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ తదితర పథకాలు ఇతర రాష్ట్రాలు, దేశాల దృష్టిని సైతం ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) టీమ్ కూడా ఏపీలో పాలన భేష్ అంటూ కితాబిచ్చింది.

ఏపీలో పర్యటించిన టీమ్ :

ఐఐపీఏ-అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీఏ) టీమ్ తాజాగా విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. 38 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ రెండు బృందాలుగా విడిపోయి స్థానిక గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరుపై స్థానిక లబ్ధిదారులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం నరేగా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం), పీఎం ఆవాస్ యోజనా, మిషన్ అంత్యోదయ, స్వచ్ఛ భారత్, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అక్కడి సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యూనిఫాం, పుస్తకాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాలు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరు చాలా మెరుగ్గా ఉందన్నారు.

ఆర్బీకే, సచివాలయ వ్యవస్థపై ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ సంక్షేమాభివృద్దిలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామ సచివాలయాలపై ఐఐపీఏ టీమ్ ప్రశంసలు కురిపించింది. ఆర్బీకేలు, సచివాలయాల పనితీరుపై అక్కడి సిబ్బందితో మాట్లాడిన టీమ్ సభ్యులు.. వాటి పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. అలాగే, వెల్‌సెస్ సెంటర్ల పనితీరు కూడా అభినందనీయమన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కూడా చాలా బాగుందని అన్నారు. ఫించన్ల అమలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం, అంగన్‌వాడీల్లో ఇస్తున్న పౌష్టికాహారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో పర్యటించిన ఈ బృందంలో వివిధ శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ అధికారులు, త్రివిధ దళాల ఉద్యోగులు ఉన్నారు.