పనితీరు బట్టే పదవుల్లో ప్రాధాన్యత..
పనితీరు బట్టే పదవుల్లో ప్రాధాన్యత.. బాబు యాక్షన్ ప్లాన్
ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా తెదేపా అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3 గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజావ్యతిరేకతను ఓటుగా మార్చాలి
ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో అనుకూలంగా మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్ వరకూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా రూపొందించిన కార్యాచరణను నేతల ముందు ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరిపై రెండేసి సర్వేలు
బూత్ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతీ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు కమిటీలు యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాక్ ఆఫీస్ బృందంగా దాదాపు 10మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు..
ప్రతి నెలా నివేదికలు
బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్, యూనిట్ ఇన్‌ఛార్జ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలోనే సరిదిద్దుకునేలా కమిటీలు ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. నాలుగు స్థాయిల్లో ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలించి వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు..
సీఎం ఎవరనేది సమస్య కాదన్న జనసేనాని
టీడీపీ-జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయనుకుంటున్నానని, టీడీపీ, బీజేపీ మధ్య అండర్‍స్టాడింగ్ ఇష్యూ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాళ్ల మధ్య సమస్యలపై మాట్లాడలేను కానీ కచ్చితంగా కలిసే పోటీ చేస్తామని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనేది తమ విధానమన్నారు. 2014లో కలిసే పనిచేశామని, 2019లో విడిపోయామని, 2020లో బీజేపీ-జనసేన ఒకే వేదికపైకి వచ్చాయని వివరించారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని, ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. సీఎం ఎవరనేది సమస్య కాదన్నారు. జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటున్నారని చెప్పారు.
